నిజామాబాద్ క్రైమ్ సెప్టెంబర్ 19 ( ప్రజా గళం )
మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పనిచేస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్ బండి నరేందర్ వద్ద నుంచి పెన్షన్ డబ్బులు ఎత్తుకెళ్లిన ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడారు. గత నెల 30న బండి నరేంధర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్నట్లు చెప్పారు. పెన్షన్ పంపిణీ కోసం తీసుకొచ్చిన రూ. 8 లక్షలు రాత్రి దొంగిలించినట్లు చెప్పారు. మాక్లూర్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు.. టెక్నికల్ సాక్ష్యాలు ఆధారంగా నిందితులను గుర్తించి, విశ్వసనీయ సమాచారం మేరకు వారిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవీపేట్ మండలంలోని నాగేపూర్ కు చెందిన కోండమొల్ల రాకేష్(19), ఆదే గ్రామానికి చెందిన ఆసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ పత్తి సాయి కుమార్(23)ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి నుంచి
రూ.7.68లక్షలను పత్తి సాయికుమార్ ఇంటి నుంచి,
రూ.32 వేలు కొండమొల్ల రాకేష్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు.. వీరి నుంచి మోటార్ సైకిల్, ఐఫోన్
స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడు పత్తి సాయికుమార్ గత మూడు సంవత్సరాలుగా ముబారక్ నగర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నందు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నట్లు చెప్పారు. తన ఉద్యోగ రీత్యా ప్రతి పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన పెన్షన్ డబ్బులు ఎప్పుడు తీసుకొని వస్తారు, వాటిని ఎక్కడ ఉంచుతారు సమాచారం నిందితుడికి తెలిసిందన్నారు.. ఈ కారణంగా సాయికుమార్ కు పెన్షన్ డబ్బులు కాజేయాలనే ఆలోచన కలిగిందన్నారు. తన దగ్గరి స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన కొండమొల్ల రాకేష్ కు ఈ పథకం వివరించగా, రాకేష్ దీనికి అంగీకరించినట్లు చెప్పారు. గత నెల 29న సాయికుమార్ కు పరిచయం ఉన్న సహోద్యోగి మామిడిపల్లి బీపీఎం నరేంద్ర పెన్షన్ పంపిణీ కోసం రూ. 8 లక్షలు నిజామాబాద్ ఆఫీస్ నుంచి తెచ్చి తన ఇంట్లో ఉంచుకున్నట్లు, సాయికుమార్‌కు తెలిసిందన్నారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరూ మామిడిపల్లి గ్రామానికి వెళ్లి, పథకం ప్రకారం రాకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తిగా నరేంద్ర ఇంట్లో ఆశ్రయం పొందేలా చేశాడు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత, రాకేష్ అక్కడి నుంచి పెన్షన్ డబ్బులు గల బ్యాగ్‌ను దొంగిలించి, సాయికుమార్ వద్దకు తీసుకెళ్లాడు. తరువాత ఇద్దరూ కలసి డబ్బులు ఎవరికి అనుమానం రాకుండా సాయికుమార్ ఇంట్లో దాచిపెట్టారు. మాక్లూర్ పోలీసులు సమయోచితంగా చర్యలు తీసుకోవడంతో మొత్తం నగదు తిరిగి రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. ఈ కేసును సాంకేతిక ఆధారంతో ఛేధించిన నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్, ఎస్సై ఎం. రాజశేఖర్, సిబ్బంది రాజేశ్వర్, రాజారెడ్డి, రాకేష్, దత్తద్రి గౌడ్, రాజు, చరణ్, ఐటీ కోర్ సిబ్బంది సాగర్, సందీప్ లను అభినందించారు.

