నిజామాబాద్ క్రైమ్ అక్టోబర్ 20 ( ప్రజాగళం )
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ కు జిల్లా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. నిందితుడు రియాజ్ కు జిల్లా ఆస్పత్రిలో నాలుగు రకాల ఎక్స్ రే టెస్టులు చేశారు. రియాజ్ కు చాతి, ముఖం భాగంలో గాయాలు ఉండటంతో చికిత్స అందిస్తున్నారు. చికిత్స అనంతరం ఏ క్షణంలోనైనా రియాజ్ ను రిమాండ్ కు తరలించే అవకాశాలు ఉన్నాయి. గత శుక్రవారం దొంగతనం కేసులో రియాజ్ ను సీ సీ ఎస్ పోలీసులు అరెస్టు చేసి తీసుకొస్తుండగా ప్రమోద్ అనే కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి పరారైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రమోద్ మృతి చెందడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించారు. నిందితున్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరగాలిoపు చర్యలు చేపట్టారు. కొన్ని బృందాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, మరికొన్ని బృందాలు మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. అయితే నిజామాబాద్ లోని సారంగాపూర్ ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు పక్క ప్లాన్ ప్రకారం నిందితున్ని అరెస్టు చేశారు. పోలీసుల కళ్ళుగప్పి పారిపోతున్న సమయంలో మెకానిక్ ఆసిఫ్ ధైర్యంగా రియాజ్ ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరికీ జరిగిన ఘర్షణలో ఇరువురికి గాయాలయ్యాయి. దీంతో అరెస్ట్ చేసిన రియాజ్ కు భారీ బందోబస్తు మధ్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయాలు తగ్గిన వెంటనే రియాజ్ రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

