నిజామాబాద్ క్రైమ్ ఆగస్టు 5( ప్రజా గళం )
సాంకేతిక పరిజ్ఞానంతో పెట్రేగిపోతున్న సైబర్ నేరాలను ఉక్కు పాదంతో అణిచివేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. పెట్టుబడుల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు” రాష్ట్రవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారo విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ అవగాహన కార్యక్రమంను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు , అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సైబర్ అవగాహన ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ , నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో , అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.మోసగాళ్లు “100% గ్యారంటీ రిటర్న్స్” , “డైలీ ప్రాఫిట్” , “ఇన్‌సైడర్ టిప్స్” , “ప్రత్యేక పెట్టుబడి అవకాశాలు” వంటి తప్పుడు హామీలతో అమాయక ప్రజలను ఆకర్షిస్తున్నారని తెలిపారు. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు , నకిలీ వెబ్‌సైట్లు , వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ప్రారంభంలో నకిలీ లాభాలను చూపించి , అనంతరం మరింత పెట్టుబడి పెట్టేలా ప్రలోభపెట్టి , చివరకు జైష్ , ప్రాసెసింగ్ ఫీజు , అప్‌గ్రేడేషన్ ఛార్జీలు వంటి పేర్లతో అదనపు డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
అదేవిధంగా నకిలీ ఆర్థిక సలహాదారులు , నకిలీ కంపెనీ ప్రతినిధులుగా నటిస్తూ చట్టబద్ధమైన అనుమతులు లేని సంస్థల ద్వారా పెట్టుబడులు సేకరించి ప్రజలను మోసం చేస్తున్నారని సీపీ వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు.అధిక లాభాలు వస్తాయని చెప్పే ప్రతి పెట్టుబడిని నమ్మవద్దని. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ లేదా బ్రోకర్ అధికారికంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలి. సోషల్ మీడియా , వాట్సాప్ , టెలిగ్రామ్ లేదా అపరిచిత వ్యక్తులు ఇచ్చే పెట్టుబడి సూచనలను నమ్మరాదు. వెంటనే పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేసే వ్యక్తులను విశ్వసించరాదు. పెట్టుబడి పెట్టే ముందు కుటుంబ సభ్యులు లేదా అర్హత కలిగిన ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి.
సైబర్ మోసాలకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్కు కాల్ చేయాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. త్వరితగతిన ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు.
తెలంగాణ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని , సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకులు , ఆర్థిక సంస్థలు, సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందినప్పుడే సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని స్పష్టం చేశారు.
ప్రతి పౌరుడు ” Be Alert – Be Aware – Be Safe” అనే సూత్రాలను పాటిస్తూ, ” అప్రమత్తతే రక్షణ – ధృవీకరణే భద్రత – అవగాహనే ఆయుధం” అనే సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం విద్యార్థులు , పోలీసు అధికారులు , అధ్యాపకులు, సిబ్బందితో కలిసి సైబర్ అవగాహన పోస్టర్స్ ఆవిష్కరణ చేసి , ర్యాలీ నిర్వహించి ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ యాదవ్ , నిజామాబాద్ రూరల్ ( నార్త్ ) సీఐ శ్రీనివాస్ , సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మొఖీద్ పాషా , మాక్లూర్ ఎస్‌ఐ అనిల్ కుమార్ , సైబర్ క్రైమ్ ఎస్‌ఐలు రవి కుమార్ , ప్రవళిక , సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది , విజయ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్స్ గణేష్ , సురేష్ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

