నిజామాబాద్ క్రైమ్ ఆగస్టు 11 (ప్రజాగళం )
ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.నిజామాబాద్ నగరంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో బున్ని మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన కుమార్తె శేషాల మేఘన (30), అల్లుడు శేషాల నరేష్ తమ నివాసంలో మృతిచెందినట్లు సమాచారం అందింది.
ఫిర్యాదు ప్రకారం, దంపతులు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాలుగవ టౌన్ ఎస్ హెచ్ ఓ సతీష్ తెలిపారు. నరేష్ ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. సంఘటన స్థలంలో మేఘన పురుగుల మందు సేవించి ఉండగా, నరేష్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. ఇద్దరినీ ఆసుపత్రులకు తరలించగా వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు.

సంఘటన స్థలంలో దంపతులు రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకోగా, అందులో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఫిర్యాదుదారు కూడా భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారి మృతిపై తనకు ఎలాంటి అనుమానం లేదని తెలిపారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంద న్నారు. అయితే ఇద్దరు దంపతుల ఆత్మహత్యతో వారి ఇద్దరి చిన్నారులు అనాధలుగా మారారు.

