నిజామాబాద్ ఆగస్టు 12 (ప్రజాగళం ప్రతినిధి )
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్ను బుధవారం న్యూఢిల్లీలో కలిశారు. నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
దివ్యాంగుల సమస్యలు, సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవల సులభతపై ఎంపీ వివరించారు. వీల్చైర్లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాల కోసం అంచనా శిబిరాలు విస్తరించాలని కోరారు.విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెంచడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో అందుబాటు సౌకర్యాలు మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గంలో కేంద్ర పథకాలు అర్హులందరికీ చేరేలా పనిచేస్తున్నామని ఎంపీ తెలిపారు. సహకారానికి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఎంపీ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల సంక్షేమానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

