నిజామాబాద్ సిటీ , ఆగష్టు 13( ప్రజా గళం )
ఆసియా ఖండంలోని ప్రఖ్యాతిగాంచిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో పనిచేస్తున్న దినసరి కూలీలు మూడు నెలలుగా జీతాలు రాక దీనస్థితిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరాహార దీక్షలకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నీరడి లక్ష్మణ్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఒంటెద్దు పోకడలతో దినసరి కూలీలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. ఆర్పిఐ పార్టీ పక్షాన మా ప్రతినిధులు వెళ్లి బకాయిల విషయమై చైర్మన్ ను నీలదియగా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దినసరి కూలీల సమస్యలపై ప్రజాగళం మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్పగంగారెడ్డిని వివరణ కోరగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చించామని , గతంలో కూడా బకాయిలు ఉండడంతో అప్పులు చేసి బకాయిలు చెల్లించామన్నారు. గత మూడు నెలలుగా వేతనాలు బకాయిలు ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. వారం పది రోజుల్లో బకాయిలను సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు తమపై కక్షతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులుకొయ్యాడ రాజ్ కుమార్, మహిళా అధ్యక్షురాలు తార, దినసరి కూలీల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కూలీలు పాల్గొన్నారు.

