నిజామాబాద్ జనవరి 6 (ప్రజాగళం ప్రతినిధి).
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న అధికారులు స్పందించకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా అధికారులు నిత్యం సంచరించే ప్రాంతంలోనే అడ్డగోలు నిర్మాణాలు అధికారులకు కనిపించడం లేదు.నిజామాబాద్ నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగం అక్రమార్కులకు అడ్డగా మారింది. నగరంలో విచ్చలవిడిగా చేపడుతున్న అక్రమకట్టడాలు అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారుల్లో మాత్రం కదలిక కనిపించడం లేదు. నగర ప్రణాళిక కార్యాలయంలో మామూళ్లు ముట్ట చెప్తే ఏ పనైనా సాధ్యమవుతుంది. ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి కార్యాలయం సిబ్బంది కొందరు అక్రమ నిర్మాణదారులతో బెరసారాలు సాగిస్తున్నారు..

మామూళ్లు ముట్ట చెప్పిన వారిపై ఎలాంటి ఫిర్యాదులు అందిన పట్టించుకోరు. పైగా లంచాలు పుచ్చుకున్న సిబ్బంది ఈ విషయాన్ని వెంటనే అక్రమ నిర్మాణదారులకు చేరవేస్తుంటారు. పైగా ఫిర్యాదు దారుల నుండి ఒత్తిడి పెరిగితే నామమాత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో ఓ కంపెనీ యజమాని రోడ్డునక్రమించుకుని అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు అందితే అక్రమ కట్టడాన్ని పరిశీలించిన అధికారులు మూడు రోజుల్లో కూల్చివేయాలని ఆదేశించి వెళ్లిపోయారు. టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించిన అక్రమ కట్టడం మాత్రం ఆగిపోలేదు. పైగా పనులు మరింత వేగంగా సాగడంతో టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ కట్టడంపై ఒత్తిడి రావడంతో తుతూ మంత్రంగా నోటీసులు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారుల నోటీసులు సైతం ఖాతార్ చేయని కంపెనీ యజమాని సాఫీగా రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణం సాగిస్తున్నారు. అదేవిధంగా సుభాష్ నగర్ లో ఓ భవన యజమాని రెండంతస్తుల భవనానికి మునిసిపాలిటీ నుండి అనుమతి తీసుకొని మూడంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది పోయి ఓ మధ్యవర్తి ద్వారా అతనితో భేరేసారాల కు దిగి పెద్ద ఎత్తున ముడుపులు పుచ్చుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టౌన్ ప్లానింగ్ అధికారులు లంచం తీసుకున్నట్లు తెలుసుకున్న ఫిర్యాదుదారులు ఏకంగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని టౌన్ ప్లానింగ్ లోని సిబ్బంది కొందరు అక్రమ భవన నిర్మాణదారునికి సమాచారం అందించడం విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అదేవిధంగా నగర నడి బొడ్డున గల ప్రధాన బస్టాండ్ ఎదుట భారీ భవన నిర్మాణం జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సీరియస్ గా దృష్టి సారించి నగరంలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

