నిజామాబాద్ జనవరి 5( ప్రజా గళం ).
తనను తరచుగా దొంగని అవమానించినందుకు అల్లుడు తన అత్తను చంపేశాడు. నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ లో ఈనెల మూడవ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును 48 గంటల్లో చేదించారు. ఈ మేరకు రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సారంగాపూర్ కు చెందిన దుబ్బాక సాయమ్మ (62) ఈ నెల 3వ తేదీన తన ఇంట్లో హత్యకు గురయ్యారు. మృతురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామన్నారు. సాయమ్మ రెండవ కూతురి భర్త లక్ష్మణ్ గతంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటివరకు అతనిపై 30 కేసుల వరకు నిజామాబాద్, కామారెడ్డి నమోదైనట్లు వెల్లడించారు. అదేవిధంగా మాట్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో కూడా నిందితుడుగా ఉన్నట్లు తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు.

తరచుగా తనను దొంగ అంటూ అత్త అవమానించిందని, దీనిని భరించలేక హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు సిఐ వెల్లడించారు. సిపి ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టి ఆదివారం ఉదయం సారంగాపూర్ లో లక్ష్మన్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్దనుండి మృతురాలికి సంబంధించిన మూడున్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని, అతనిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు. హత్య కేసును 48 గంటల్లో చేదించిన ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్రావు, యాదగిరి ఉన్నతాధికారులు అభినందించినట్లు తెలిపారు.

