నిజామాబాద్ జనవరి 8 ( ప్రజాగళం ).
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉద్యోగులు సహకరించడం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని శ్రావ్య గార్డెన్లో టీఎన్జీవోస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా భూపతిరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు కోరిన ప్రకారం నిజామాబాద్ లోని తన నియోజకవర్గంలో కళ్యాణ మండపం ఏర్పాటు కోసం ఎకరం భూమి, కోటి రూపాయలు నిధులు అందజేస్తానన్నారు. అసైన్డ్ భూములలో ఉద్యోగులు ఇండ్లు నిర్మించుకునే విధంగా 80 గజాల స్థలాన్ని అందించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 207 వివిధ ఉద్యోగ సంఘాలు టీఎన్జీవోస్ పరిధిలో పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉద్యోగులు చేస్తున్న కృషిని తెలంగాణ ప్రభుత్వం గమనిస్తుందని ఆయన అన్నారు.

ఉద్యోగులకు సంబంధించిన 51 సమస్యలను ప్రభుత్వానికి అందజేశామని, వీటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. తాహెర్ బిన్ హందన్, నుడా చైర్మన్ కేశ వేణు, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజ్బీర్ రెహమాన్,ఉపాధ్యక్షులు గైని గంగారం, జిల్లా అధ్యక్షులు సుమన్, ప్రధాన కార్యదర్శి శంకర్, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

