నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం 92.46 పట్టభద్రుల పోలింగ్ శాతం 76.78.

నిజామాబాద్ బ్యూరో ఫిబ్రవరి 27 🙁 ప్రజా గళం )

నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షణలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఓటింగ్ నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, పట్టభద్రులు, ఉపాద్యాయ ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8.00 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్, అనంతరం వేగం పుంజుకుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.  కాగా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎస్.ఎఫ్.ఎస్ పాఠశాలలో పోలింగ్ స్టేషన్ నెం 122 లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కలెక్టర్ పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను, పోలింగ్ నిర్వహణ తీరును పరిశీలించారు. మాక్లూర్ మండలం మాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ స్టేషన్లను సందర్శించిన కలెక్టర్, ఓటింగ్ కొనసాగుతున్న తీరును గమనించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వెబ్ కాస్టింగ్ ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలలో నెలకొని ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పోలింగ్ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బ్యాలెట్ బాక్సులను ప్రత్యేక వాహనాలలో కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ కు తరలించేలా కలెక్టర్ పర్యవేక్షణ జరిపారు. కాగా సాయంత్రం నాలుగు గంటల వరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ పోలింగ్ శాతం 92.46 కాగా, పట్టభద్రుల పోలింగ్ శాతం 76.78 శాతంగా అధికారులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.