పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండాలి. తె.యూ.లో జాతీయ గ్రీన్ కార్ప్స్ దినోత్సవం.

 

 

నిజామాబాద్ రూరల్ ఆగస్టు 1( ప్రజా గళం )

పర్యావరణ పరిరక్షణలో యువత ముందుండాలని వక్తలు పిలుపునిచ్చారు.

తెలంగాణ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) సెల్ ఆధ్వర్యంలో పర్యావరణ విద్యా కార్యక్రమం (ఈఈపీ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో జాతీయ గ్రీన్ కార్ప్స్ (ఎన్‌జీసీ) దినోత్సవాన్ని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో శనివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–2 కార్యక్రమాధికారి డా. ఎ.ఎ. హలీం ఖాన్ జాతీయ గ్రీన్ కార్ప్స్ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పర్యావరణ పరిరక్షణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 కార్యక్రమాధికారి డా. శ్రీనివాస్ మాట్లాడుతూ, యువత పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నోడల్ అధికారి డా. రమేశ్వర్ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి, ప్రత్యామ్నాయ పర్యావరణహిత ఉత్పత్తులను వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.

 

ఎన్‌ఎస్‌ఎస్ సెల్ కార్యక్రమ సమన్వయకర్త ప్రొ. కె. అపర్ణ మాట్లాడుతూ, విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించే కార్యక్రమాలు మరింత విస్తరించాలని పేర్కొన్నారు. ముఖ్య అతిథి తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ప్రాజెక్టు అధికారి బోస్కె విద్యాసాగర్ మాట్లాడుతూ విభిన్న రకాల మొక్కల పెంపకం ద్వారా జీవవైవిధ్యం పరిరక్షితమవుతుందని, మొక్కల సంరక్షణతో కీటకాలు, పక్షులు, ఇతర జీవరాశులు కూడా రక్షించబడతాయని తెలిపారు. ఎకో క్లబ్‌ల ద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో, క్లౌడ్‌బర్స్ట్‌లు, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.