జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు కట్టుబడి ఉంది. హరీష్ రావు చేతబడి చేస్తున్నట్లు నేను అనలేదు. ఆలయాల్లోకి వెళ్లి ఎలాంటి పూజలు చేశారో చెప్పాలి. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ. మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

 

 

నిజామాబాద్ ఆగస్టు 5 (ప్రజా గళం ప్రతినిధి )

 

 

నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ఆయన అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీష్ రావు చేతబడి చేస్తున్నట్లు తాను అనలేదని, కానీ కొన్ని ఆలయాల్లో ఎలాంటి పూజలు చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సీఎంఆర్ రైస్ మిల్లులపై పెండింగ్లో ఉన్న బకాయిల వసూళ్లపై కేబినెట్ లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. తప్పు చేసిన వారు ఏ పార్టీ వారైనా ఉపేక్షించేది లేదని వారిపై చర్యలు తప్పవన్నారు. రైస్ మిల్లుల అక్రమాలపై కేసులు నమోదు అవుతున్నాయ న్నారు. పెండింగ్ లో ఉన్న ఆర్ఓబి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. బీహార్ లోని బంకీపూర్ లో ఓటమి మోడీ పతనానికి నాంది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పాదయాత్ర వల్ల ఒరిగేది ఏమీ లేదని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8o శాతం సీట్లు సాధించడం ఖాయమన్నారు. భారీ వర్షాల వల్ల ప్రాజెక్ట్ పనులకు జాప్యం జరుగుతుందని, దీనికి ప్రజలు సహకరించాలని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుందన్న కేటీఆర్ పై మహేష్ కుమార్ గౌడ్ మరోసారి ఫైర్ అయ్యారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నీరు నిల్వదని చెప్పిన పనులు చేపట్టడం కేవలం కమిషన్ల కోసమేనని ఆయన ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అధికారుల సూచన మేరకే పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కాట్పల్లి నగేష్ రెడ్డి, నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.