నిజామాబాద్ సిటీ ఆగస్టు 6( ప్రజా గళం )
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రజాప్రతినిధిగా నా బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈనెల 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్ లో గల శ్రీరామ గార్డెన్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 60 కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. ప్రధానంగా 2 వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, బీటెక్, పీజీ తదితర విద్యార్హతలు కలిగిన యువతీ యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశ్రమలకు నిరుద్యోగులకు మధ్య వారధిగా నిలిచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిజామాబాద్ యువతలో ఎంతో ప్రతిభ ఉందని, వారికి సరైన మార్గదర్శనం అందించడం తన బాధ్యత అని పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితిని తగ్గించేందుకు ప్రముఖ కంపెనీలను నేరుగా ఇందూరుకు తీసుకురావడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి బయోడేటా విద్యార్హతల ధ్రువపత్రాల ప్రతులు, ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ఉదయం 9 గంటల నుంచి హాజరుకావాలని కోరారు. అలాగే జాబ్ మేళా కు సహకరిస్తున్న కంపెనీలు, వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

