నందిపేట్ ఆగస్టు 14 ( ప్రజా గళం)
ఒంటరి మహిళలే లక్ష్యంగా వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను గంటల వ్యవధిలోనే నందిపేట్ పోలీసుల అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నందిపేట ఎస్సై వినయ్ వివరాలను వెల్లడించారు.

నందిపేట్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ కేసుల ను ఛేదించడంజరిగిందన్నారు. అంతర్ జిల్లా దొంగ నుండి 4 తులాల 3 గ్రాముల బంగారు పుస్తేల తాడులు, బైక్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
నందిపేట్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గురువారం జరిగిన వరుస చైన్ స్నాచింగ్ (బంగారు గొలుసుల దొంగతనం) కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించినట్లు ఎస్సై తెలిపారు.సీసీ కెమెరాల నిఘా, పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై స్పష్టం చేశారు. నందిపేట్ మండలం బాద్గుణ గ్రామానికి చెందిన నాలేశ్వరం దిలీప్ అనే నిందితుడు గతంలో 2025 డిసెంబర్ మాసంలో తన సంబంధీకులతో కలసి ‘రమేష్’ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడన్నాడు.ఆ కేసును కోర్టులో కొట్టివేయించడానికి డబ్బులు అవసరం కావడం తో, ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్స్ చేయాలని ప్లాన్ వేశాడని ఎస్సై వినయ్ వెల్లడించారు. పోలీసులకు, సీసీ కెమెరాలకు దొరకకుండా ఉండేందుకు బైక్ నంబర్ AP 25 AD 9490 (CT 100) పై రెండు వేర్వేరు టీ-షర్టులు (వైట్, బ్లూ) మార్చుకుంటూ నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.
నందిపేట్ పరిధిలో (బజార్ కొత్తూర్ శివారు) మాయాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒంటరిగా ఉన్న ఒక వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తానని బైక్‌పై ఎక్కించుకుని, మార్గమధ్యలో బజార్ కొత్తూర్ శివారు తోటల వద్ద ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకొని పారిపోయినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా మాక్లూర్ పరిధిలో (గొట్టుముక్కల శివారు): అక్కడ నుండి వేరే టీ-షర్ట్ ధరించి, గొట్టుముక్కల గ్రామం వద్ద బైక్ వెనుక వెళ్తున్న మరో మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని వేగంగా పారిపోయాడు.
దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించడానికి నిందితుడు శుక్రవారం నిజామాబాద్ వైపు వెళ్తుండగా, సిమ్రాజ్ పల్లి సబ్ స్టేషన్ వద్ద నందిపేట్ పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో పట్టుకోవడం జరిగిందన్నారు.. పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వెంబడించి చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందన్నారు.
నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు తాను చేసిన దొంగతనాల నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
నిందితుడి వద్ద నుండి ఒక పుస్తె ఉన్న బంగారు గొలుసు: తూకం సుమారు 2 తులములు (నందిపేట్ వద్ద లాగినది).రెండు పుస్తెలు ఉన్న బంగారు గొలుసు: తూకం సుమారు 2.3 గ్రాములు (గొట్టుముక్కల వద్ద లాగినది). ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుందామన్నారు.
ప్రజలు, ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో అపరిచిత వ్యక్తులను నమ్మి లిఫ్ట్ తీసుకోవద్దు. బంగారం లేదా విలువైన వస్తువులతో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వినయ్ సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కి గానీ, స్థానిక పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలన్నారు.
సమర్థవంతంగా పనిచేసి నిందితుడిని త్వరితగతిన పట్టుకున్న పోలీసు అధికారులను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించడం జరిగిందన్నారు. నిందితుడిని న్యాయస్థానం లో హాజరు పరచగా రిమాండ్‌కు తరలించడమైనదని తెలిపారు.

