ప్రభుత్వ భూమిని ప్రైవేట్ స్థలంగా మార్చిన ఘనులు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో యదేచ్చగా ఇంటి నిర్మాణాలు. గత కలెక్టర్ ఆదేశాలను బుట్ట దాఖలు చేసిన వైనం.

నిజామాబాద్ ఆగస్టు 22 ( ప్రజాగళం ప్రతినిధి )

 

వడ్డించేవాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్న ప్రయోజనమే అన్న చందంగా తయారైంది అధికారుల పనితీరు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ స్థలంగా మార్చేశారు.ఏకంగా ప్రభుత్వ స్థలంలోనే ప్రైవేటు వ్యక్తులు ఇంటి నిర్మాణం చేపడుతున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. గతంలో నిజామాబాద్ కలెక్టర్ గా పనిచేసిన ప్రద్యుమ్న ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించిన ఇంటి నిర్మాణానికి రెవెన్యూ అధికారులు ఎన్ ఓ సి ఇవ్వడం విమర్శలకు బలాన్ని చేకూరుస్తుంది. నగర నడిబొడ్డున గల నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఇంటి నిర్మాణం జరగడం దానికి అధికారులు వత్తాసు పలకడం వెనుక ఆంతర్యమేమిటో అంతు చిక్కడం లేదు. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ కు ఆనుకొని 443 సర్వే నెంబర్ లో గల స్థలంలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయి. గతంలోనూ ఇదే సర్వే నంబర్ లో ఓ రిటైర్డ్ ఎస్సై తన పలుకుబడిని ఉపయోగించి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాజాగా మరో ఇద్దరూ వ్యక్తులు ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇదిలా ఉండగా 443 సర్వేనెంబర్ లో స్థలం పూర్తిగా ప్రభుత్వాన్నిదేనని గత కలెక్టర్ ప్రద్యుమ్న నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఆదేశాలను సంబంధిత రెవెన్యూ అధికారులకు పంపించారు. దీంతో ఆ స్థలాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని కంచె ఏర్పాటు చేసింది. అప్పటి అధికారులు సైతం ఆ స్థలంలోకి ఎవరిని రాకుండా అడ్డుకున్నారు. ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వ స్థలం అంటూ నిర్ధారించారు.

కలెక్టర్ బదిలీ తర్వాత ఆ స్థలం పై కన్నేసిన ప్రైవేట్ వ్యక్తులు అధికారులకు మామూళ్ల ఆశ చూపి అక్రమ నిర్మాణాలకు తెర లేపారు. దీనికి అవసరమైన అనుమతులు సైతం రెవెన్యూ అధికారులు ఇవ్వడం, తద్వారా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం వెనుక భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారులను వివరణ కోరగా రెవెన్యూ అధికారులే ఎన్వోసీ ఇవ్వడం వల్ల మేము ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని చెప్పడం ముడుపులు ముట్టాయన్న ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇదే సర్వే నంబర్ లో గత ప్రభుత్వం ఈవీఎం గోదాములను నిర్మించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ స్థలం కావడంతోనే ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే నిర్మించాలని నిబంధనలో ఉన్నప్పటికీ అలాంటి ఆలోచన లేకుండా ఈ సర్వే నంబరు మిగిలిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం అధికారుల అసమర్ధతకు నిదర్శనంగా మారింది. ఈ అక్రమ ఇంటి నిర్మాణాల ముందు నుండే నిత్యం జిల్లా అధికారులు వెళ్లడం, వాటిపై దృష్టి సాధించకపోవడం ప్రైవేట్ వ్యక్తులకు వరంగా మారింది.ఇదిలా ఉండగా గతంలో 443 సర్వేనెంబర్ లో ఓ మాజీ ఎమ్మెల్సీ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు. అది ప్రభుత్వ స్థలం అప్పటి కలెక్టర్ తేల్చడంతో లక్షలు నష్టపోయిన ఆ స్థలాన్ని వదిలేసుకున్నాడు. ప్రభుత్వ స్థలాలను కాపాడుతామని ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు నీటి మీద బుడగలుగా మారాయి. జిల్లా కేంద్రంలోని కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని కాపాడడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అధికారులు పాలకుల నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వాన్ని అబాసు పాలు చేస్తుంది.ఇకనైనా జిల్లా కలెక్టర్ సీరియస్ గా పరిగణించి అధికారుల చేతివాటానికి అన్యక్రాంతమవుతున్న ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూమి గా గుర్తించిన అధికారులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రైవేట్ స్థలంగా మార్చి అడ్డదారుల్లో అనుమతులు ఇవ్వడం వెనుక భారీగా ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.