ఆర్మూర్,ఆగస్టు 22 (ప్రజాగళం)
పాలకులు,ప్రజా ప్రతినిధులు మారిన ..ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు ..ప్రజా సేవకు,పాలనకు అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ భవనం.ప్రజాపాలన అసౌకర్యంగా మారిన గ్రామ పంచాయతీ భవనం. ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో మూడేళ్లుగా గ్రామ పంచాయతీ భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడం వల్ల స్థానిక పాలన,ప్రజా సేవలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.ఇందువలన పాలకవర్గం సమావేశాలు నిర్వహించడానికి,ప్రజలకు సేవలు అందించడానికి సరైన వసతి లేక ప్రత్యామ్నాయలపై ఆధారపడుతున్నారు.గ్రామ పంచాయతీ భవనం లేక మహిళా భవనాన్ని వాడుకుంటున్నారు.మహిళా భవనంలోనే గ్రామపంచాయతీ,ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సేవలు,మహిళా సంఘ సమావేశాలు ఓకే భవనంలోనే నడుస్తున్నాయి.గ్రామపంచాయతీ కార్యాలయం లేక పంచాయతీ రికార్డుల భద్రతకు,అధికారుల రాకపోకలకు,ప్రజల సేవలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.పాత గ్రామపంచాయతీ భవనాన్ని 2023వ సంవత్సరంలో కూల్చివేశారు.అదే సమయంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరైనాయి.సదరు కాంట్రాక్టర్ పిల్లర్లు,స్లాబ్ దశ వరకు నిర్మాణం జరిపాడు.మొత్తం 16 లక్షల రూపాయల్లో 11 లక్షల పైచిలుకు మొత్తానికి రికార్డులు చేయించి బిల్లులు తీసుకున్నాడు.మిగతా మొత్తం భవన నిర్మాణం పూర్తి కాకపోవడం,సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మిగతా నిధులు ప్రభుత్వ ఖాతాకు తిరిగి వెళ్ళిపోయాయి.అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణానికి గోడల నిర్మాణం,ప్లాస్టరింగ్ కు సుమారు రూ.10 లక్షల పైనే నిధులు మంజూరైతేనే నిర్మాణం పూర్తవుతుంది.సంబంధిత అధికారులు,జిల్లా కలెక్టర్ చొరవ చూపితే గ్రామపంచాయతీ భవనానికి నిధులు మంజూరు అవుతాయని గ్రామ ప్రజలు,సర్పంచ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
*గ్రామపంచాయతీ భవనాన్ని పూర్తి చేస్తాం.*
– ఏనుగు ప్రణుక నాగరాజ్.
అసంపూర్తిగా గ్రామపంచాయతీ భవన నిర్మాణం ఉండడం వాస్తవమే.నిధుల కొరత,గత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అసంపూర్తి భవనానికి కారణమన్నారు.సర్పంచ్ హోదాలో గ్రామ ప్రజలకు మేలు చేస్తాను.ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్,ఉన్నతాధికారులకు గ్రామ పాలకవర్గం,ప్రజలతో కలిసి వినతిని అందిస్తాం.స్థానిక ఎమ్మెల్యే,జిల్లా ఇంచార్జీ నాయకుల చొరవతో రూ.5 నుండి 10 లక్షలు మంజూరు చేయించి అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.


