విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. ~వామపక్ష పార్టీల డిమాండ్.

 

నిజామాబాద్,జూలై 28,ప్రజాగళం:

 

జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా సెక్రటేరియట్ ఓమయ్య సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య లు మాట్లాడుతూ

నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల దేశవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా జిల్లాలోని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు బంద్ నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా నగరంలోని రెయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీని బంద్ చేస్తున్నక్రమంలో యాజమాన్యానికి విద్యార్థి సంఘాల నాయకులకు స్వల్ప ఘర్షణ జరిగిందన్నారు. ఈ ఘటనపై యాజమాన్యం వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు నాలుగవ టౌన్ లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోగా, యాజమాన్యంతో తప్పుడు ఫిర్యాదు రాయించి, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ఆందోళనలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. కేసులు ఎత్తివేయాలని కేంద్రంపై ఒత్తిడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఈ అక్రమ కేసులపై స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ కమిషనర్ గారు భేషజాలకు పోకుండా, అక్రమ కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై, విద్యారంగంలో ప్రైవేట్ కార్పొరేటు ఫీజుల దోపిడీపై రాజీలేని పోరాటం చేస్తున్న వామపక్ష విద్యార్థి నాయకులపై పోలీసులు కక్షపూరిత వైఖరిని విడనాడాలన్నారు. ఈ అక్రమ కేసులు ఎత్తివేసేలా వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలను ప్రారంభిస్తామని హెచ్చరించారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.