ఫోక్సో కేసుల్లో దర్యాప్తులను వేగవంతం చేయాలి. సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

 

 

నిజామాబాద్ క్రైమ్ ఆగస్టు 16 (ప్రజా గళం )

 

 

నిజామాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్ లో ఉన్న ఫోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. వేగవంతమైన విచారణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి,నేరస్తులకు శిక్షపడేలా బలమైన ఆధారాలు సేకరించాలని సీపీ సాయి చైతన్య ఆదేశించారు.

నిజామాబాద్ జిల్లాలో చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసుల దర్యాప్తు , కేసుల పురోగతిపై ఆదివారం పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో సీపీ సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చిన్నారులపై లైంగిక దాడులు , లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించారు.

 

ఈ సందర్భంగా ఆయా కేసుల్లో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు , నిందితుల గుర్తింపు , అరెస్టులు , సేకరించిన ఆధారాలు , సాక్షుల వివరాలు , బాధిత చిన్నారుల వాంగ్మూలాలు , కేసుల ప్రస్తుత స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి కేసులో దర్యాప్తు ఏ దశలో ఉందనే విషయాన్ని క్షుణ్ణంగా సమీక్షించి , పెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తించారు.నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయడం , బాధిత చిన్నారులకు త్వరితగతిన న్యాయం జరిగేలా దర్యాప్తును వేగవంతం చేయడంపై పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. పోక్సో కేసుల్లో చిన్నారుల భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని , బాధితుల పట్ల సున్నితమైన వైఖరితో వ్యవహరించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని , అవసరమైన ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేయించి నివేదికలు పొందాలని ఆదేశించారు. అదేవిధంగా బాధితులు, నిందితులకు సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు.

కేసుల్లో లభించిన సీసీటీవీ ఫుటేజ్ , మొబైల్ ఫోన్లు , డిజిటల్ ఆధారాలు , ఇతర సాంకేతిక ఆధారాలను నిబంధనల ప్రకారం సేకరించి , వాటిని దర్యాప్తులో సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. సాక్షుల వాంగ్మూలాలు , ఇతర కీలక ఆధారాలను పకడ్బందీగా నమోదు చేసి కేసులు కోర్టులో బలంగా నిలిచేలా దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు , మెడికల్ రిపోర్టులు , ఇతర దర్యాప్తు ప్రక్రియలు పూర్తయిన వెంటనే చార్జ్‌షీట్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. పోక్సో కేసుల్లో చార్జ్‌షీట్ ఫైలింగ్‌లో ఎలాంటి అనవసర జాప్యం ఉండకూడదని , సాధ్యమైనంత తక్కువ సమయంలో దర్యాప్తును పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.

పెండింగ్‌లో ఉన్న ప్రతి పోక్సో కేసును సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని , దర్యాప్తులో ఏవైనా సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేసుల పురోగతిపై నిరంతరం సమీక్ష నిర్వహించి , బాధిత చిన్నారులకు సత్వర న్యాయం అందేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని , నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా వేగవంతమైన , శాస్త్రీయ , నాణ్యమైన దర్యాప్తు చేపట్టడమే లక్ష్యమని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ , నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్ , వెంకటేశ్వర రెడ్డి , శ్రీనివాస్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి , మల్లేషం , సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య, సిఐలు ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.