ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నిరసన..

 

బాన్సువాడ, ప్రజాగళం. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా బాన్సువాడ పట్టణంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బకాయిలు అందక చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక చదువులను మధ్యలోనే నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వెంటనే పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి వారి చదువులు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చీదురు సాయిలు, జిల్లా కార్యదర్శి శంకర్‌గౌడ్, కౌన్సిలర్ గజ్జల మహేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఉమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు తృప్తి ప్రసాద్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి, బీజేపీ నాయకులు గురుకుల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, చీకట్ల రాజు, పాశం భాస్కర్‌రెడ్డి, శ్యామల శ్రీకాంత్, కొండని గంగారం, పురుషోత్తం, సచిన్, సందీప్, మహేందర్, ఫణిందర్, భూమేష్, లక్ష్మణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.