నిజామాబాద్ జనవరి3 ( ప్రజా గళం ప్రతినిధి )
నిజామాబాద్ జిల్లా నవీపేట్ లో ముగ్గురు పదవ తరగతి విద్యార్థినిల మిస్సింగ్ కలకలం రేపింది. ఈ కేసును సీరియస్ గా పరిగణించిన నవీపేట్ పోలీసులు విస్తృతంగా గా లించి మిస్సింగ్ కేసు మిస్టరీని చేదించారు.నవీపేట్ మండల కేంద్రంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినిలు గురువారం పాఠశాలకు వెళ్లి రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే నవీపేట్ పిఎస్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పిపోయిన బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తప్పిపోయిన వారిలో కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళిక అనే విద్యార్థినిలు తప్పిపోయినట్లు గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరo చేశారు. వారిలో కొండపల్లి శిరీష ఆచూకీ శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో నిజామాబాద్ బస్టాండ్ లో లభించింది. బాలిక ద్వారా ఆరా తీసిన పోలీసులు మిగిలిన ఇద్దరు బాలికలను వేములవాడ ప్రాంతంలో గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో మిస్సింగ్ కథ సుఖాంతమైంది. దీంతో పోలీసులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

