ఊర పండుగకు సర్వం సిద్ధం. సీసీ కెమెరాల నిఘాలో భారీ బందోబస్తు. ఏర్పట్లను పరిశీలించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

నిజామాబాద్ ఆగస్టు 1 (ప్రజా గళం ప్రతినిధి )

నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించనున్న ఊర పండుగకు సర్వం సిద్ధమైంది. ఇందూర్ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఊరు పండుగ ఏర్పాట్లను చేపట్టారు. ఆషాడ మాసంలో నిర్వహించనున్న ఊర పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం అమ్మవారి విగ్రహాలను తయారు చేశారు. గత ఏడాది నిర్వహించిన ఏర్పాట్లలో భారీ యాత్రలో భాగంగా లాటి చార్జి జరిగిన విషయం విధితమే. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం పరిశీలించారు. అమ్మ వార్ల విగ్రహల ఊరేగింపు జరిగే ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారీగా పోలీస్ బలగాలను మోహరించినన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీపీ సాయి చైతన్య ప్రత్యేక పర్యవేక్షణ చేయనున్నారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఊర పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్నాయి. శనివారం అర్ధరాత్రి ఊర పండుగ జరిగే ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. గోదావరి జలాలతో తీసుకువచ్చి అమ్మవార్ల విగ్రహాలకు జలాభిషేకం చేయడంతో ఊర పండుగ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గత మూడు రోజులుగా అమ్మవార్ల విగ్రహాలను తయారు చేయడంతో పాటు, గురువారం రోజు బండారు ప్రక్రియను పూర్తి చేశారు. ఖిల్లా రఘునాథ ఆలయం నుండి అమ్మవారి రా విగ్రహాల ఊరేగింపు ప్రారంభించి నగరంలోని ప్రధాన వీధుల గుండా యాత్ర కొనసాగుతుంది. ఊరేగింపు సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల విన్యాసాలతో పాటు కోళ్లను, మేకలను, నైవేద్య ప్రసాదాలుగా అమ్మవారికి ప్రసాదిస్తారు. ఖిల్లా చౌరస్తా వద్ద తేలు మైసమ్మ ఆలయం వద్ద అమ్మవారి విగ్రహాలకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభిస్తారు.

అదేవిధంగా వినాయక్ నగర్ లోని ఐదు చేతుల పోచమ్మ, దుబ్బ ప్రాంతంలోని పెద్దమ్మ తల్లి దేవాలయం, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మి నగర్లోని మహా లక్ష్మమ్మ,, కోట గల్లీలోని సారలమ్మ ఆలయాల వద్ద ఊరేగించిన విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. పండగను పురస్కరించుకొని తొక్కిసలాట జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కార్యచరణ రూపొందించారు. గత ఏడాది సరి ప్రక్రియలో భాగంగా వివేకానంద విగ్రహం వద్ద తొక్కిసలాట జరగడంతో పోలీసులు స్వల్ప లాఠిచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఎదురవకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు.
అమ్మవారి విగ్రహాల ఊరేగింపు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వ సమాజ్ కమిటీ సన్నాహాలు చేపట్టింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం అమ్మవారి విగ్రహాలను దర్శించుకొని, ఊరేగింపు జరిగే రూట్ మ్యాప్ ను పరిశీలించారు.సర్వ సమాజ్ కమిటీ కో కన్వీనర్ అదే ప్రవీణ్, రామర్తి గంగాధర్,యెoడల లక్ష్మీనారాయణ, బంటు రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.