ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి. జయంతి వేడుకలో ఇంచార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా.

 

 

నిజామాబాద్, ఆగస్టు 06 ( ప్రజాగళం ప్రతినిధి )

 

 

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి, ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని ప్రశంసించారు. 1969 ఉద్యమంతో పాటు మలి విడత ఉద్యమం లోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఆశ, శ్వాసగా ఆరు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా అలుపెరుగని కృషి చేస్తూ ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.

ఆయన సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారని అన్నారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనకు అన్ని వర్గాల వారు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

కాగా, అంతకుముందు కంటేశ్వర్ చౌరస్తాలో గల ఆచార్య జయశంకర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ వి.భుజంగరావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను శ్లాఘిస్తూ, జయంతి వేడుకలో భాగస్వాములయ్యారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్ఓ గీత, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇంచార్జి అధికారిణి రజిత, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.