నిజామాబాద్ జనవరి, 3 (ప్రజాగళo)
ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సు మరోసారి మొరయించింది. నిజామాబాద్ ఆర్టీసీలో ఇటీవల కొన్ని కొత్తగా బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టారు. ఈ కొత్త బస్సులను డిసెంబర్ నెలలో ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి బాన్సువాడకు టీజీ 16 టీ 2125 నెంబర్ గల బస్సు బయలుదేరింది. నిజామాబాద్ బస్టాండ్ నుంచి బయలుదేరిన ఎలక్ట్రికల్ బస్సు ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్దకు చేరుకోగానే మార్గమధ్యంలో నిలిచిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న జనం ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ ఆప్రమత్తమై ప్రయాణికులను కిందికి దింపేశారు. అనంతరం వారిని మరో బస్సు ద్వారా గమ్యస్థానాలకు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా గత నెల డిసెంబర్ 25వ తేదీన నూతనంగా ప్రారంభించిన ఎలక్ట్రికల్ బస్సు నిజామాబాద్ నుండి బాన్సువాడ కు వెళ్తుండగా మార్గమధ్యంలోని నాగారం ప్రాంతంలో నిలిచిపోయింది.వెంటనే తేరుకున్న ఆర్టీసీ అధికారులు హుటాహుటిన డిపో నుండి మెకానిక్ లను పంపించి మరమ్మత్తులు చేయించారు. అయితే నూతనంగా ప్రవేశపెట్టిన బస్సులు తరచుగా మొరాయించడం పై ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. నెలరోజులు గడవకముందే ఇదే రూట్ లో ప్రయాణించే ఎలక్ట్రికల్ బస్సు రెండవసారి మొరాయించడం ఆర్టీసీ పై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

