నిజామాబాద్, జనవరి 29 :
జర్నలిస్టు స్వర్గీయ మల్లెపూల నరేంద్ర కుమార్ నిబద్ధతతో పనిచేసి అందరి ఆదరాభిమానాలు పొంది నేటితరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిల్చారని నుడా ఛైర్మన్ కేశ వేణు అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు మల్లెపూలు నరేంద్ర కుమార్ 34 వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేశ వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి స్నేహశీలి 1991 జనవరి 29న ముదక్ పల్లి వద్ద పోలీస్ నక్సలైట్ల ఎదురుకాల్పులలో మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. చిన్న వయసులోనే వృత్తి పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉండి వార్తలను రాసేవారని అన్నారు. ఆయన గ్రామీణ ప్రాంత విలేఖరిగా పని చేస్తూ ఆ ప్రాంతాలలో ప్రభుత్వం స్పందించే రీతిలో ప్రజల సమస్యలను కండ్లకు కట్టినట్లు కథనాలు రాసేవారని అన్నారు. నాడు రవాణా సదుపాయం ఉండేది కాదు. అయినప్పటికీ తనకు ఏదైనా సమాచారం తెలిస్తే అక్కడికి తప్పకుండా వెళ్లి ఆ వార్తను కవర్ చేసేవారు. ఇందులో భాగంగానే జనవరి 29 న న్యూస్ కవరేజ్ కోసం వెళ్లి పోలీస్ నక్సలైట్ల మధ్య జరిగిన ఎదురు కాల్పులు మృతి చెందడం బాధాకరమన్నారు.

ఈ సంఘటన జరిగి 34 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికి ఆయనను గుర్తుంచుకొని ఆయన పేరిట కార్యక్రమాలు నిర్వహించడం నిర్వాహకులను, సహకారాలు అందిస్తున్న వారిని అభినందించారు. ఒక వ్యక్తి మృతి చెందితే ఆయన పేరిట ఐదు సంవత్సరాలు వరకు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించి మర్చిపోతారు. కానీ జర్నలిస్టు నరేంద్రను 34 సంవత్సరాలుగా స్మరించుకుంటూ ఆయన పేరిట స్మారక క్రీడా పోటీలు నిర్వహించడం బహుశా ఎక్కడ లేదని అన్నారు. దీనిని ఇలాగే కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రస్తుతం జర్నలిజం దయనీయ పరిస్థితుల్లో ఉందన్నారు. జర్నలిస్టులను కష్ట కాలంలో ఆదుకోవడానికి ఏర్పాటుచేసిన వెల్ఫేర్ కమిటీ కి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
జర్నలిస్టు లు పూర్తి అంకితభావంతో పనిచేస్తున్న వారి కుటుంబ పోషణ కు సరిపడే ఆదాయం రాకపోవడం శోచనీయమన్నారు. మరో అతిథి బాపూజీ వచనాలయం కమిటీ చైర్మన్ భక్తవత్సలం మాట్లాడుతూ జర్నలిజంలో మంచి గుర్తింపు పొందిన జర్నలిస్టుగా నరేందర్ గుర్తింపు పొంది ఆనాతి కాలంలోనే మృతి చెందడం వారి కుటుంబానికి తీరని లోటు అన్నారు. అందరితో మంచి స్నేహం కలిగి ఉన్న నరేందర్ కవిగా రచనలు కూడా చేశారని గుర్తు చేశారు.

ఒకప్పుడు జర్నలిజం వృత్తిలో తక్కువ మంది కొనసాగవారు. ఇప్పుడు అనేక వృత్తిలో కొనసాగుతుండడం సంతోషకరం. కానీ జర్నలిస్టులకు సరైన జీతభత్యాలు లేకపోవడం దుర్భారమైన జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఇలా కొనసాగిస్తూనే మరింత సంపాదన కోసం మరో మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. బాపూజీ వచనాలయంలో కమిటీలో ఐదుగురికి చోటు కల్పిస్తామని, ప్రెస్ క్లబ్ నుంచి పేర్లు అందజేయాలని కోరారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతడుపుల రామకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టు నరేంద్ర ను గుర్తుంచుకొని 34 సంవత్సరాలుగా పోటీలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు క్రీడా పోటీలు నిర్వహిస్తూ తమలో ఐక్యత బావాన్ని కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర సోదరులను అభినందించారు.

ప్రజాగళం పత్రిక ఎడిటర్ కొక్కు రవికుమార్ ప్రతి సంవత్సరం ఈ క్రీడా పోటీలలో క్రికెట్ మ్యాచ్ కు స్పెషల్ బహుమతి అందించే విధంగా సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వచ్చారు.
*విజేతలకు బహుమతుల ప్రధానం…*
జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర 34 వర్ధంతి పురస్కరించుకొని జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన షటిల్ బ్యాట్మెంటన్ క్యారం పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులను ప్రధానం చేశారు. క్యారం పోటీలలో గెలుపొందిన సంజీవరెడ్డి సదానంద్ లకు ప్రథమ బహుమతి, డాన్స్ రాజు శ్రీకాంత్ లకు ద్వితీయ బహుమతులను ప్రధాన చేశారు. అలాగే షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీకాంత్, భాను తేజ లకు ప్రథమ బహుమతి, గంగా దాస్ దశరథులకు ద్వితీయ బహుమతులను ప్రధానం చేశారు.అదే విధంగా క్రికెట్ మ్యాచ్ లో ఆంజనేయులు, దశరథ్ లకు ప్రజాగళం సీఈఓ రాజ్ కుమార్,ఎడిటర్ రవికుమార్ స్పెషల్ బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైరా శేఖర్, జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, స్పోర్ట్స్ కమిటీ వ్యవస్థాపక సభ్యుడు సాంబయ్య, కన్వీనర్ మల్లెపూల నరసయ్య, టీయు డబ్ల్యూజే 143 యూనియన్ అధ్యక్షుడు రజినికాంత్, ఉపాధ్యక్షుడు బాలు కుమార్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు చింతల గంగాదాస్, తెలంగాణ జర్నలిస్టు యూనియన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరసింహ చారి, ప్రధాన కార్యదర్శి సుభాష్ వాగ్మారే, సీనియర్ పాత్రికేయులు పాకాల నరసింహులు, సాయి ప్రసాద్ , పంచ రెడ్డి శ్రీకాంత్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫొటోగ్రాఫర్లు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

