అన్ని రంగాలలో మహిళలు రాణించాలి జిల్లా జడ్జి సునీత కుంచాల.

 

నిజామాబాద్ బ్యూరో మార్చి 12 ( ప్రజాగళం )

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి సునీత కుంచాల విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజంలో సగభాగమైన మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతూ అద్భుతాలు సాధించాలని ఆకాంక్షించారు. మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా పోటీపడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్రతి మహిళ విద్య, క్రీడలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలని అభిలషించారు. మహిళలు తమ హక్కులను, బాధ్యతలను గుర్తెరిగి వాటిని కాపాడుకునేందుకు కృషి చేయాలన్నారు. అప్పుడే సమాజంలో సముచిత గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు, వివిధ సంస్ధల వారు అందిస్తున్న తోడ్పాటును పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేయాలని సూచించారు. మోసాలకు, అన్యాయాలకు గురైన సందర్భాలలో న్యాయం కోసం పోరాడాలని అన్నారు. జిల్లా స్థాయిలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలందించిన మహిళలకు శాలువాలు కప్పి సన్మానం చేశారు.

Leave A Reply

Your email address will not be published.