నిజామాబాద్ క్రైమ్ , మే 02( ప్రజా గళం)
నలుగురు నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా తయారయింది కొందరి క్లబ్ నిర్వాహకుల పనితీరు. ఏకంగా సంఘం కు సంబంధించిన కళ్యాణ మండపంను పేకాట క్లబ్ గా మార్చడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బాద్గుణ గ్రామంలోని గురడి కాపు కళ్యాణమండపం పేకాటకు అడ్డాగా మారింది. పోలీసుల కళ్ళు కప్పి ప్రతిరోజు లక్షలలో పేకాట ఆడుతూ పోలీసులకు సవాలుగా నిలిచారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య బాధ్యతలు చేపట్టడంతో నేరాలపై ఉక్కు పాదం మోపారు. ఈ క్రమంలోని పక్కా సమాచారం మేరకు నందిపేట్ పోలీసులు బాద్గుణ గ్రామంలోని గురడికాపు కళ్యాణమండపంలో నందిపేట ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 12 మంది పేకాట రాయుళ్ళను పట్టుకున్నారు. వారి నుండి 2,12,500 నగదు తోపాటు రెండు కార్లు, రెండు బైకులు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే కొందరు ఆర్గనైజర్లు కళ్యాణ మండపన్ని పేకాటకు అడ్డగా మార్చి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో పేకాట క్లబ్బులను నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో క్లబ్ లు మూతపడడంతో నందిపేట్ మండలంలో పేకాట అడ్డాని ఏర్పాటు చేసి లక్షల్లో పేకాట ఆడిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన నందిపేట్ ఎస్సై చిరంజీవి పకడ్బందీగా దాడి నిర్వహించి పేకాట అడ్డా గుట్టురట్టు చేశారు.

