కవిత జిల్లా పర్యటనలో కనిపించని జోష్. కలిసిరాని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

 

నిజామాబాద్ జూన్ 7 ( ప్రజాగళం ప్రతినిధి )

శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జిల్లా పర్యటనలో జోష్ కనిపించలేదు. ముఖ్యనాయకులతోపాటు కార్యకర్తలు సైతం కవిత పర్యటనలో దూరంగా ఉండడం రాజకీయ చర్చకు దారితీసింది. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా కవిత వెంట కలిసి రాకపోవడం చర్చనీయంశమైంది. నిజామాబాద్ జిల్లాలో 3రోజుల పాటు కవిత విస్త్రుతంగా పర్యటించారు. మొదటి రోజు సిహెచ్ కొండూరులోని లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. మరుసటిరోజు జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయాన్ని సందర్శించి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈసందర్భంగా రాజకీయాల జోలికి వెళ్లకుండా కేవలం దాశరథి జయింతి ఉత్సవాలపైనే మాట్లాడారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అయితే కవిత వెంట మాజీ మేయర్ దండు నీతు కిరణ్, మాజీ నుడా ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి గడ్డం సుమన రెడ్డి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, పలువురు సొసైటీ ఛైర్మన్లు, మాజీ మండల అధ్యక్షులు, మాజీ ఎంపిపీ, జడ్పీటిసీలు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్థానికంగా ఉన్నప్పటికీ కవితను కలవకపోవడం,

 

పెద్దగా ప్రచారం లేకపోవడం సైతం కవిత పర్యటనపై ప్రజల్లో అనాసక్తికి కారణమైంది. గతంలో జిల్లా పర్యటకు కవిత వచ్చిందంటే భారీగా స్వాగత ఏర్పాట్లు, భారీ కాన్వాయ్ వాహనాల హడావిడి, కార్యకర్తల సందడి కనిపించేది. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతోపాటు కేవలం కొన్నికార్యక్రమాలకే పరిమితమైంది. ఏలాంటి రాజకీయ ప్రకటనలు చేయకపోవడం అదేవిధంగా ఆమె వెంట కేవలం జాగ్రుతి నాయకులు నామమాత్రంగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కొత్త పార్టీ ఏర్పాటుచేయనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో బీఆర్ ఎస్ నాయకులు ఆమె పర్యటనపై ఆసక్తి చూపడంలేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఈనెల జూన్ 2న తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కొత్త పార్టీ ప్రకటిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ తాత్కాలికంగా వాయిదా పడడంతో బిఆర్ఎస్ నేతలు ఆమె పర్యటనకు దూరంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఆమె జిల్లా పర్యటనతో జిల్లా బీఆర్ఎస్ నేతలు పార్టీ హైకమాండ్ కు నివేదికలు అందజేసినట్లు తెలుస్తోంది. కవితతొపాటు ఆమెను కలిసిన వారి పేర్లతో నివేదిక హైకమాండ్ కు చేరినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.