నిజామాబాద్ బ్యూరో జూన్ 17 ( ప్రజా గళం )
గణనీయమైన దిగుబడితో అధిక లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు కోసం ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ నేతృత్వంలో ఉద్యానవన శాఖ అధికారులు మంగళవారం ఆర్మూర్ మండలం చేపూర్ లోని ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న లక్షన్నర ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించి, క్షేత్రస్థాయి పరిస్థితిని కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా రైతులకు ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ఈ పంట సాగు వల్ల కలిగే లాభాల గురించి ప్రతి రైతు తెలుసుకోవాలని సూచించారు. వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. దేశవ్యాప్తంగా స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా 75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరగాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం పది శాతం విస్తీర్ణంలోపే ఈ పంట సాగు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల ఇతర దేశాల నుండి వంట నూనె నిల్వలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉందన్నారు. స్థానికంగానే ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించడంతో పాటు దేశానికి కూడా మేలు చేసిన వారవుతారని అన్నారు. ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. ఆయిల్ పామ్ మొక్కలకు అయ్యే వ్యయంలో కూడా అధిక మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ సబ్సిడీ రూపంలో కంపెనీలకు చెల్లిస్తుందని అన్నారు. ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ఎకరం విస్తీర్ణంలో సుమారు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, అంతర పంట వేసుకొని అదనపు లాభాలను సైతం పొందవచ్చని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.
ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకు ఉన్న డిమాండ్ ను బట్టి చూస్తే ఎకరానికి కనీసం రెండు లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును జిల్లా రైతాంగం అందిపుచ్చుకుని, ఆయిల్ పామ్ సాగు ద్వారా ఇతోధికంగా లాభాలు సాధించాలని కలెక్టర్ హితవు పలికారు.

