భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డ. ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీ.సీ ద్వారా సమీక్ష జరిపిన కలెక్టర్.

నిజామాబాద్ బ్యూరో ఆగస్టు 05 ( ప్రజా గళం )

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్.ఐలు, సర్వేయర్లతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ డిచ్పల్లి నుండి వీ.సీలో పాల్గొన్నారు.

భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో మండలం వారీగా తహసిల్దార్, ఇతర సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓలు ప్రతిరోజు ఒక మండలాన్ని తప్పనిసరిగా సందర్శిస్తూ, భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్న మండలాల తహసీల్దార్లను, జాప్యానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే చెబుతున్నప్పటికీ, ఆర్జీల సత్వర పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదని పలువురు తహశీల్దార్ల పని తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.

ఆమోదించిన దరఖాస్తులను 24 గంటల లోపు ఆర్డీఓల ఆమోదం కోసం పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులతో పాటు మీ-సేవ కేంద్రాల ద్వారా ఆన్లైన్ లో వచ్చిన భూభారతి అర్జీలను కూడా వెంటదివెంట పరిష్కరించాలని అన్నారు. సాదా బైనామా కు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు అందిన వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించేందుకు వీలుగా నోటీసులు రూపొందించుకుని అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని కలెక్టర్ సూచించారు. స్పష్టమైన కార్యాచరణను రూపొందించుకుని భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు, అన్ని మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.