ప్రజాసేవలో ద్రోణవల్లి సతీష్.

 

బాన్సువాడ, ఆగస్టు 26, ప్రజాగళం.

రాజకీయ రంగంలో పదవుల కోసం పోరాడేవారు అనేకమంది ఉంటారు.పదవులు లేకున్నా ప్రజా సేవతో గుర్తింపు పొందిన వ్యక్తుల సంఖ్య తక్కువే. అలాంటి వారిలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ద్రోణవల్లి సతీష్‌ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది.

సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి..

సతీష్ జీవితంలో “చేతికి ఎముకలేదన్నట్లు” సహాయం అందించడం ఓ అలవాటు. గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి సహాయం చేయడం, విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వడం, నిరుపేదలకు అండగా నిలవడం ఆయన నిత్యకృత్యమే.రాజకీయ రంగంలో ఉన్నా లేకపోయినా, ప్రజా సేవే తన అసలు పిలుపు అని ఆయన నిరూపిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం..

1992లో సాధారణ టిడిపి కార్యకర్తగా రాజకీయాల్లో అడుగుపెట్టిన సతీష్, క్రమంగా ప్రత్యేక స్థానం సంపాదించు కున్నారు.1993లో మండల తెలుగు యువత కార్యదర్శి, ఎన్నికల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు.1994లో బాన్సువాడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేసి సామర్థ్యాన్ని చూపారు. 2001లో బీర్కూర్ జడ్పీటీసీగా ఎన్నికై ప్రజలకు మరింత చేరువయ్యారు.

పోచారం తో సన్నిహిత్యం.. దూరం

దీర్ఘకాలం పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సతీష్‌ ఆయనకు కఠిన సమయాల్లో బలంగా నిలిచారు. అయితే,గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ బంధం దూరమైంది. తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ సెట్‌కార్ విజయానికి కృషి చేయడం ద్వారా సతీష్ తన దిశను మార్చుకున్నారు.

కాంగ్రెస్ వైపు అడుగులు…

ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండి, బాన్సువాడ కాంగ్రెస్ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో దగ్గరగా ఉంటున్నారు. పార్టీనీ బలపరిచే పనిలోనూ ఆయన పాత్ర ప్రస్తావనీయమే. బలమైన స్థానిక క్యాడర్‌,నమ్మకమైన వర్గం ఆయనకు బలం.

ప్రత్యేకత ఏమిటి?

సతీష్ రాజకీయ జీవితంలో ముఖ్యమైన విషయం,పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. తనకు నమ్మకంగా ఉన్న నాయకుల కోసం కష్టపడటమే ఆయన ధోరణి. ఇది ఆయనను మిగతా నాయకులకన్నా ప్రత్యేకంగా నిలబెడుతోంది.

భవిష్యత్ అవకాశాలు..

బాన్సువాడలో కాంగ్రెస్ శక్తివంతంగా నిలబడాలంటే ద్రోణవల్లి సతీష్ వంటి నేతల పాత్ర కీలకం కానుంది. గ్రామ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు బలమైన అనుబంధాలు కలిగి ఉండడం,నిష్పక్షపాత సేవలతో గుర్తింపు పొందడం ఆయన భవిష్యత్ రాజకీయాల్లో పెద్ద ప్లస్‌గా మారే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.