బాన్సువాడ, అక్టోబర్ 21, ప్రజాగళం.
దీపావళి పండుగ ఆనందాన్ని ఓ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆభరణాల కోసం ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ తండాలో చోటుచేసుకుం ది.సోమవారం సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేస్తుండగా ఓ వృద్ధురాలిని అదే తండాకు చెందిన ఓ వ్యక్తి హతమార్చాడు.
స్థానికుల సమాచారం ప్రకారం గుగులోత్ రాదిబాయి (65) తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ పూజలు నిర్వహిస్తుండగా, ఆభరణాలపై దృష్టి పెట్టిన మెగావత్ సవాయి సింగ్ అనే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రాదిబాయి వద్ద ఉన్న సుమారు 60 తులాల వెండి ఆభరణాలు కాజేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి చొరబడి, గొడ్డలితో దాడి చేశాడు. ఆపై చున్నీతో ఉరివేసి హత్య చేశాడు.
శబ్దం విని పరుగున చేరుకున్న పొరుగువారు అడ్డుకునే ప్రయత్నం చేయగా,వారిపైనా సవాయి సింగ్ దాడికి దిగినట్లు సమాచారం.గాయపడినవారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య, నసురుల్లాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్లు, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. హంతకుడిని అదుపులోకి తీసుకునే చర్యలు వేగవంతం చేశారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రంతా అధికారులు అక్కడే మకాం వేశారు. ఈ ఘటనతో అంకోల్ తండా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
పండుగ రోజే ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంతో తండా ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రాదిబాయి మరణం పట్ల గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
