జిల్లా కేంద్రంలో భారీగా గంజాయి పట్టివేత. ఐదుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్. నిందితుల్లో ఇద్దరు మహిళలు. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సూపరిoటెండెంట్ మల్లారెడ్డి.

 

నిజామాబాద్ జనవరి 8( ప్రజాగళo ప్రతినిధి)

మధ్యప్రదేశ్ కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ గంజాయి రవాణా ముఠాగుట్టు ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఆరు లక్షల విలువైన 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.. అరెస్టు చేసిన వారిలో ఇద్దరు మహిళలు ఉండడం ఎక్సైజ్ పోలీసులను విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరిoటెండెంట్ మల్లారెడ్డి వివరాలను వెల్లడించారు. అదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దేవులా తాండ కు చెందిన పూజా పవర్, అదే జిల్లా కుప్పి గ్రామానికి చెందిన దుర్వదా భాయి జాదవ్ ఇద్దరు కలిసి మధ్యప్రదేశ్ లోని సిర్పూర్ పట్టణంలో 9వేల రూపాయలకు కిలో చొప్పున గుర్తుతెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. మహారాష్ట్రలోని కిన్వాట్ కు చెందిన కిషన్ మోతిరామ్,

 

 

ఇంద్రజిత్ ఠాగ్రేలను కలుసుకొని బస్సు ద్వారా నిర్మల్ కు చేరుకున్నారు. అక్కడినుండి వీరు నలుగురు కలిసి గురువారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండా కు చెందిన మంజ వెంకట్రాం కు గంజాయి ప్యాకెట్లు ఇస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. పక్కా సమాచారం మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ స్వప్న ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి అక్రమ గంజాయి ముఠాను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో వెంకట్రాoను విచారించగా తాను వారి వద్ద 15వేల రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేశామన్నారు. దానిని నిజామాబాద్ నగరంలో 2o వేల వరకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. వీరి వద్ద నుండి ఆరు లక్షల విలువైన 13 కిలోల గంజాయితోపాటు ఐదు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ స్వప్న తో పాటు ఎస్సైలు సుస్మిత, మల్లేష్, సిబ్బంది సునీల్, ప్రభాకర్, రవి, సంగయ్య, సౌమ్య, సుచరిత, సంజయ్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.