జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.

 

 

నిజామాబాద్ బ్యూరోజనవరి 21 ( ప్రజా గళం)

 

జిల్లా కేంద్రంలోని అర్సపల్లి లో గల ఏ.వీ ఎంటర్ ప్రైజెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్ లో కొనసాగుతున్న జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. 175 మంది విద్యార్థులకు గాను ఉదయం సెషన్ పరీక్షకు 173 మంది, మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 171 మంది హాజరయ్యారని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, సీ.సీ కెమెరా నిఘా నడుమ నిబంధనలకు అనుగుణంగానే పరీక్ష నిర్వహిస్తున్నారా? సరిపడా పోలీసు బందోబస్తు ఉందా అని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో తాగునీటి వసతి, జెనరేటర్ ఇత్యాది వసతులు అందుబాటులో ఉన్నాయా అని గమనించారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. కలెక్టర్ వెంట పరీక్ష కేంద్రం అబ్జర్వర్ శ్రీకాంత్, సెంటర్ ఇంచార్జి జావీద్, నార్త్ తహసీల్దార్ విజయ్ కాంత్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.