ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో మరింత పురోగతి సాధించాలి. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష.

 

నిజామాబాద్, ఏప్రిల్ 27( ప్రజా గళం ప్రతినిధి)

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో మరింత పురోగతి సాధించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ భవనంలో సోమవారం నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి పొంగులేటి రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు సమీక్షలో పాలుపంచుకోగా, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, 2BHK హౌసింగ్ పథకాల పురోగతి, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం గురించి మంత్రి పొంగులేటి సమీక్షించి, అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయాలని, అర్హులైన పేదలకు గృహాలు సమయానికి అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతను పాటించాలని, లబ్ధిదారులు వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా తోడ్పాటును అందిస్తూ క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు హౌసింగ్ ఎండీ గౌతమ్ , నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.