నిజామాబాద్ జూన్ 24 ( ప్రజా గళం ప్రతినిధి)
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన మల్లారెడ్డి బాటలోనే మరికొందరిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఫోకస్ చేశారు. ఈ సంఘటనతో మామూళ్ల మత్తులో మునిగిపోయిన అబ్కారీ శాఖలోని కొందరు అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ క్షణంలోనైనా తమపై ఏసీబీ దాడి జరిగే అవకాశం ఉందని ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎవరిని కదిలించిన దీనిపైన విస్తృతంగా చర్చించుకుంటున్నారు. గత కొంతకాలంగా ఎక్సైజ్ శాఖలోని పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ప్రచారం జరిగింది. ఓ అధికారి అయితే ఏకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేసిన వసూళ్ల పర్వం ఉన్నతాధికారుల వద్దకు చేరినప్పటికీ చర్యలు తీసుకోవడంలో రాజకీయ నాయకుల ఒత్తిళ్లు అడ్డుగా నిలిచినట్లు ఆ శాఖలో ప్రచారం జరిగింది. నిషేధిత మత్తు పదార్థాలను కలిగివున్న కల్లు వ్యాపారిని రెడ్ హ్యoడెడ్ గా పట్టుబడ్డప్పటికీ వారి నుంచి భారీగా మామూళ్లు తీసుకొని వదిలేసినట్లు విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా ఓ అధికారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, కల్లుబట్టీలు, బార్లు, పరిమిట్ రూముల నుండి భారీగా మామూలు వసూలు చేశారన్న ఫిర్యాదు ఉన్నతాధికారికి చేరిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. అయితే అధికారి వసూలు చేసిన మామూళ్లను కిందిస్థాయి సిబ్బందికి పంచకపోవడంతో వారు అప్పటి డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం ఎక్సైజ్ శాఖలో పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాకుండా కొందరి అధికారుల నెలసరి మామూళ్ల రూపంలో వచ్చే ఆదాయం లక్షల్లో ఉన్నట్లు తెలుస్తుంది.తమకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో వారి అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇష్టారాజ్యాంగా వసూలు చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ అక్రమ వసూళ్లకు కిందిస్థాయి సిబ్బందిని వాడుకున్నట్లు అబ్కారీ శాఖలో ప్రచారం లో ఉంది. తాజాగా ఆదాయంకు మించి ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన మల్లారెడ్డికి సైతం ఆ శాఖలోని రిటైర్డ్ ఉద్యోగి వసూళ్లకు సహకరించారని అనుమానిస్తున్నారు. ఆదిశగా ఏసీబీ అధికారులు విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉన్నతాధికారి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ కి చిక్కడంతో కిందిస్థాయి అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది.

