నిజామాబాద్ జులై 16 (ప్రజా గళం ప్రతినిధి)
కేసీఆర్ దత్తపుత్రుడిగా, పదేళ్లు అధికారంలో ఉండి జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడానికే దొంగ దీక్షలు చేపడుతున్నారని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ను చూసి ఓర్వలేకనే ప్రశాంత్ రెడ్డి అవాకులు చవాకులు పేలుస్తున్నారని నగేష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలలో కేసీఆర్ దత్తపుత్రుడిగా ప్రశాంత్ రెడ్డికి వాటా ఉందని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మీ పార్టీని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని ఆయన అన్నారు. పదేళ్లు మీ పార్టీ అధికారంలో ఉండి జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయలేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయలతో జరుగుతున్న భీంగల్ అభివృద్ధి మీకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా భీంగల్ అభివృద్ధి నీ ఎందుకు విస్మరించారని ఆయన ప్రశ్నించారు. డాక్టర్ల సలహా మేరకే నిరాహార దీక్ష చేపట్టారని, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఓటరు సవరణ ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిధులు కేటాయిస్తే, టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పూర్తి వివక్షతకు గురి చేశారని ఆరోపించారు. కమిషన్లు దండుకునే దానిపై ఉన్న శ్రద్ధ ప్రజలకు, రైతులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేయలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గాల విభజన లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 120 స్థానాలు సాధించడం ఖాయమన్నారు. భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ కు లోపాయికార ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు భక్తవత్సలo, రత్నాకర్ గౌడ్, జావిద్ అక్రమ్, విపుల్ గౌడ్, రాజు, నరేందర్ గౌడ్, గోపి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

