నిజామాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 12(ప్రజాగళం)
తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా బీ జే పీ ఎంపీలు కృషి చేయాలని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన గురువారం విడుదల చేశారు.
బయ్యారం ఉక్కు – తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కే సీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామని బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాకముందే 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాయడం జరిగిందన్నారు.
లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయన్నారు.
అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పెరుగుతాయ న్నది కేసీఆర్ ఆలోచన అని కవిత స్పష్టం చేశారు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉందన్నారు.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందేనని ఆమె అన్నారు.
10 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న బిజెపి హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె అన్నారు.
ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బిజెపి ప్రభుత్వం సాకు చూపిస్తోందని విమర్శించారు.
ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కావడానికి అవసరమైన మరో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ను ఛత్తీస్ ఘడ్ నుంచి తీసుకువచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ మాట్లాడారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.
బిజెపికి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కాదని పార్లమెంటు సాక్షిగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడం బాధాకరమన్నారు.
రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీ జే పీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా స్పందించకపోవడం శోచనీయమన్నారు.
ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారన్నారు.
ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొంగులేటి దీనిపై మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
బీజేపీప్రభుత్వం పై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయించాలన్నారు.

