నిజామాబాద్ బ్యూరో జూలై 06 ( ప్రజా గళం )
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన 81 సంవత్సరాల వృద్ధురాలు సబ్బని శాంతాబాయి ధైన్య స్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. ఆమె ముగ్గురు కుమారులు చంద్రమోహన్, హరిచరణ్, సాయిరాంలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా అవసరమైన తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి వారు కోరిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. పుట్టుకతోనే అంధులుగా జన్మించిన ముగ్గురు కుమారులకు సపర్యలు చేయడానికి వృద్ధురాలు శాంతాబాయి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవీయ కోణంలో స్పందిస్తూ, శాంతాబాయి కుటుంబానికి అవసరమైన తోడ్పాటును అందించాల్సిందిగా ఆదేశించారని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని జిల్లా అధికారులతో కూడిన బృందం ఆదివారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించారని అన్నారు. ప్రభుత్వం తరపున శాంతాబాయికి వృద్ధాప్య పెన్షన్, ఆమె ముగ్గురు కుమారులకు దివ్యాంగుల పెన్షన్ వస్తోందని వెల్లడించారు.
శాంతాబాయి కుటుంబం ముందుకు వస్తే, ప్రభుత్వ భాగస్వామ్యంతో డిచ్ పల్లి మండలం రాంపూర్ లో అన్ని వసతులతో కొనసాగుతున్న వృద్ధాశ్రమంలో చేర్పించి, తగిన సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. స్వగ్రామంలోనే ఉండాలని వారు కోరుకుంటే, స్థానికంగానే వారికి అవసరమైన సదుపాయాలు, సహకారం అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే అధికారులతో చర్చించామని, బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచేలా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా పూర్తి స్థాయిలో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ భరోసా కల్పించారు.

