నిజామాబాద్ ఏప్రిల్ 28 (ప్రజా గళం ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడు కురిపిస్తున్న నిప్పులతో జనం విలవిలలాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలలో మొదటి స్థానంలో నిలిచింది. గత పక్షం రోజులుగా ఎండల తీవ్రత జిల్లాను అతలాకుతలం చేస్తుంది. బయట తిరగాలంటే వడ దెబ్బ తలుగుతుందోనన్న భయం వెంటాడుతుంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ప్రతిసారి వేసవికాలంలో అదిలాబాద్ జిల్లా అత్యధిక ఉష్ణోగ్రతలతో రికార్డు నెలకొల్పేది. కానీ తొలిసారి నిజామాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలలో ఆదిలాబాద్ జిల్లాను మించిపోయింది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మండు టెండలో తిరగాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించింది. ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల రోగాల బారిన పడడంతో పాటు చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండలో తిరగకుండా ఇంట్లోనే కూర్చున్నప్పటికీ ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని , నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు, ఉప్పు, చక్కెర ద్ర వణం వంటివి ఇంట్లో తయారు చేసుకొని తీసుకుంటే ఎండ వేడి నుండి వచ్చే రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. మద్యం, టీ,కాఫీ శీతల పానీయాలు, అధిక చక్కెర పానీయాలు సేవించడం వల్ల అనర్ధాలు ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు. దాహం వెయ్యకపోయినా మీరు మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకోవాలని అంటున్నారు. వచ్చే రెండు, మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని దీంతో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. ఇక మధ్యాహ్నం టైమ్ లో బయట తిరగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో దూర ప్రయాణాలను మానుకుంటే మంచిదంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో జనాలతో పాటు వన్యప్రాణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. అడవులలో నీటి వనరులు ఎండిపోవడంతో పక్షులు, జంతువులు అల్లాడుతున్నాయి.

