బాల్కొండ మే 9 ( ప్రజాగళం)
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టడం లేదని మాజీమంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రేపటి వరకు రైతుల సమస్యలు పరిష్కరించకుంటే తానే స్వయంగా రైతులతో కలిసి
బాల్కొండ ఆందోళన చేపడతానని హెచ్చరించారు. బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ వద్ద ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, రైస్ మిల్లర్ల దోపిడీపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మార్కెట్ యార్డ్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే జిల్లా అడిషనల్ కలెక్టర్, సివిల్ సప్లైస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, రైతుల పక్షాన నిలదీశారు.

ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో ఉండి అరగంట నుంచి ఫోన్ చేస్తుంటే కలెక్టర్ అందుబాటులోకి రాకపోవడం ఏంటి?” అని అధికారులను ప్రశ్నించారు. రైతులు ఇక్కడ ఎండలో కష్టపడుతుంటే అధికారుల నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు.
కిసాన్ నగర్ మార్కెట్ యార్డ్ నుండి వెళ్తున్న ధాన్యానికి ముకుంద రైస్ మిల్లు యాజమాన్యం అడ్డగోలు నిబంధనలు పెడుతోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. 41.5 కిలోలకు బదులు 44.5 కిలోలు (దాదాపు క్వింటాలుకు 10 కిలోల అదనపు తరుగు) ఇస్తేనే దించుకుంటామని లారీలను లేకుంటే దింపమని రైస్ మిల్లర్లు అనడం ఏంటి అని అధికారులను నిలదీశారు.
నిబంధనలు పాటించని ఒక్క రైస్ మిల్లును సీజ్ చేయండి.. అప్పుడు అందరూ లైన్లోకి వస్తారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు మిల్లులను సీజ్ చేసి దారికి తెచ్చానని అధికారులకు సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చినా, అదనపు తరుగు అడగడం మిల్లర్ల అహంకారానికి నిదర్శనమని అన్నారు.
పాలసీ ప్రభుత్వం తయారు చేస్తుందా? లేక రైస్ మిల్లర్లు తయారు చేస్తారా? ప్రభుత్వ యంత్రాంగం ఇంత చేతగానిదిగా ఎందుకు తయారైంది?” అని ఘాటుగా ప్రశ్నించారు. తహసీల్దార్లు, ఇన్-ఛార్జ్ అధికారులు మిల్లర్లకు, రైతులకు మధ్య నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల రికార్డింగ్ సాక్ష్యం: ముకుంద రైస్ మిల్లర్ 44.5 కిలోలు అడుగుతున్న మాట వాస్తవమేనని, తన దగ్గర వీడియో రికార్డింగ్ సాక్ష్యం కూడా ఉందని అధికారులకు స్పష్టం చేశారు.
తరుగు లేకుండా ధాన్యంతో అన్-లోడింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, లారీల సంఖ్యను పెంచి రవాణాను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బోధన్, బాన్సువాడ ప్రాంతాల నుండి ట్రాన్స్పోర్ట్ వెహికిల్ డైవర్ట్ చేయాలన్నారు.
ఈ రోజు సాయంత్రం లోపు సమస్య పరిష్కారం కాకపోతే, నేనే స్వయంగా ఆందోళన నిర్వహిస్తాను. రైతుల కోసం రోడ్డు మీదకు వస్తాను” అని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతు నాయకులు, ప్రజా ప్రతినిధులు , పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

