బాల్కొండ మే 9 (ప్రజాగళం)
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు మండల కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.ఎర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నపు అంజయ్య, జిట్టావోయినా రాజు, నాయుడు పోశెట్టి వేల్పూర్‌లోని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అధికార పార్టీని వీడిన నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా వాటిని సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధు, బోనస్ వంటి హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం, పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని,తెలంగాణ కు కేసీఆర్ పరిపాలననే శ్రీరామ రక్షా అని, కేసీఆర్ ని తిరిగి అధికారంలోకి తీసుకురావడము కొరకే తాము బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజా పూర్ణనందం, ఎర్గట్ల సర్పంచ్ ఉపేందర్, మాజీ జడ్పీటీసీ గుళ్ళే రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ మధు, పార్టీ అధ్యక్షులు దేవుని నర్సయ్య, సొసైటీ చైర్మన్ బర్మా నర్సయ్య, ప్రభాకర్,కుశ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

